చెన్నై: తమిళనాడు అభివృద్ధికి కారకులెవరు? తమిళ ప్రభుత్వాలు ఏర్పాటుకు ముఖ్యులెవరు? తెలుగువారు లేకుండా మంత్రివర్గం ఏర్పాటు సాధ్యం కాదా? అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో వున్న తెలుగు వారు తాము తెలుగు వరమని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు? ఈ ప్రశ్నలు సీనియర్ నటుడు రాధారవి సంధించి కలకలం రేపారు.
తమిళనాడు అభివృద్ధి చెందుతోందని, ఇండస్ట్రీలో వున్న తెలుగు కళాకారులు అవకాశాలు రావన్న భయంతో తెలుగువారని చెప్పుకోవడానికి భయపడుతున్నారని సీనియర్ నటుడు రాధారవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నై వడపళనిలోని సినీ సంగీత కళాకారుల సంఘ భవనంలో తమిళనాడు తెలుగు ప్రజల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నటుడు ఎంఆర్ రాధ 40వ వర్ధంతి సభలో రాధారవి వ్యాఖ్యలు ఆలోచింప జేశాయి. అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాధారవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు వారు లేకుంటే రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటుచేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. తెలుగు వారి కృషి వల్లే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. తేని నుంచి దిండుగల్ వరకు తెలుగు మాతృభాష కలిగిన వారే ఎన్నికల్లో పోటీచేస్తున్నారని, మరోవైపు విరుదునగర్, శివకాశి, సాత్తూర్ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారని చెప్పారు.