– పార్టీ మార్పుపై తర్జనభర్జన
– క్యాడర్ లో మిశ్రమ స్పందన
– ఎటూ తేల్చుకోలేక అయోమయం
కాంగ్రెస్ లో అవమానం జరిగిందని కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏం చేసినా క్యాడర్ అనుమతితోనే చేస్తానని ఆయన ప్రకటించిన నాటి నుంచి పార్టీ మారిపోతున్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి మా పార్టీలోకి వచ్చేస్తున్నారని అనేశారు. కానీ.. అధికారికంగా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈక్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది.
క్యాడర్ అనుమతి కోసం రాజగోపాల్ నానా తంటాలు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మూడు రోజులుగా నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి కానీ తెగడం లేదు. పార్టీ మార్పుతో పాటు.. రాజీనామా అంశంపై కూడా స్థానిక నాయకులతో రాజగోపాల్ చర్చిస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే.. కార్యకర్తల నుంచి ఆయనకు మిశ్రమ స్పందన వస్తుండడంతో ఏం చేయాలా అనే డైలామాలో పడినట్లుగా టాక్.
నియోజకవర్గంలో రాజగోపాల్ కి మంచి పట్టు ఉంది. టీఆర్‌ఎస్ హవాలోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు. అయితే.. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కదు. కాంగ్రెస్ క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. పార్టీనే శ్వాసగా బతికే వాళ్లు ఉన్నారు. వాళ్లే ఇప్పుడు కోమటిరెడ్డికి అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మీరంటే ప్రాణం ఇస్తాం.. కానీ మీ వెంట రాలేమని కొందరు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ మారొద్దని.. అందులోనూ బీజేపీలోకి అసలు వద్దని రాజగోపాల్ తో వారు వారిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీకి నియోజకవర్గంలో అసలు అవకాశమే లేదని.. ఒకవేళ రాజీనామా చేస్తే.. తిరిగి గెలుపు సాధ్యం కాదని మరికొందరు ముఖం మీదే చెప్పేస్తున్నారని సమాచారం. మరోవైపు బీజేపీ రాజీనామా మస్ట్ అనే కండిషన్ పెట్టింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. అందర్నీ మళ్లీ కన్విన్స్ చేస్తారా? లేక చల్లబడతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.