రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి మాత్రమేనని.. రెండు లక్షల 90 కోట్లు గతంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టి రెండు లక్షల కూడా ఖర్చు పెట్టలేదని వ్యాఖ్యానించారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేటు హోటల్ ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘ఎన్నికల బడ్జెట్’ అని ఆరోపించారు.
పేదోడికి ఎన్ని ఇళ్లు కట్టిస్తామో అని బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదన్నారు. గతంలో ఐదు లక్షల ఇళ్లు అన్నారు.. ఇప్పుడు మూడు లక్షలు అంటున్నారు. ఇవి కూడా ఇస్తారో ఇవ్వరో కూడా తెలీని పరిస్థితి ఏర్పడిందన్నారు.
మిషన్ భగీరథ విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరులో తాగడానికి నీళ్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరు నాగారంలో ఇప్పటికీ ఇదే సమస్య ఉందని, కావాలంటే అక్కడికి వెళ్లి చూడొచ్చని, దానికి నేనే సాక్ష్యమని పేర్కొన్నారు.
‘హథ్ సే హథ్’ జోడో యాత్ర ఈ నెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత.. నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలను కలుపుకొని బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర ఏదో ఒకటి చేపడతానని స్పష్టం చేశారు.
ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని.. 12 నియోజకవర్గాల్లో పూర్తిగా బైక్ యాత్ర త్వరలో చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసుకుంటూ జనం లేని వద్ద కారులో ఎక్కి ప్రయాణిస్తున్నారని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.