ఎంపీ కోమటి రెడ్డి వెంకటి రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆయన ఏ పార్టో ఆయనకే తెలియదని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జై అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో కలిసి ఉంటారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు.
మంగళవారం భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి తెలంగాణ రాష్ట్ర వచ్చే ఎన్నికలలో హంగ్ ఏర్పడుతుందని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి స్పందించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హంగూ అంటూ కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగానే ఉన్నాయని అన్నారు.
అన్న ఒక పార్టీ.. తమ్ముడు మరో పార్టీ అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలవదని.. ఇంతకీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏ పార్టీ.. ఎవ్వరికీ తెలియడం లేదన్నారు. వందకి వంద శాతం 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
భారత దేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలంటూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయన్నారు.