గల్లీలో నీతులు సరే.. ఢిల్లీలో నీ చెల్లి అవినీతి కథేంది అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గల్లీల్లో పాఠాలు బానే చెప్తావ్! ఢిల్లీ లిక్కర్ లో నీ వాటా ఎంత? కాళేశ్వరం లక్ష కోట్లలో నీ కోటా ఎంత? అంటూనిలదీశారు. కొన్నాళ్లుగా కేటీఆర్, కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో ఇలా స్పందించారు.
ఇక తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారం పైనా స్పందించారు కోమటిరెడ్డి. చనిపోయేవరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అని అన్నారు.
తాను కాంగ్రెస్ లోనే పుట్టాను.. కాంగ్రెస్ లోనే ఉంటానని తెలిపారు. ఈ మధ్య కోమటిరెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇలా స్పందించారు. తాను దేనికీ భయపడనని.. ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ముఖ్యమైన సమావేశాలున్నాయి కాబట్టే ఢిల్లీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి కోసం కలిస్తే రాజకీయం చేయొద్దని హితవు పలికారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాత కాంగ్రెస్ వాళ్లను పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని విమర్శించారు. తనను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.