తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అయినా ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ప్రభుత్వ ఇల్లు నిర్మించకపోవడం ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనమని విమర్శించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో నేటి వరకు అవి సాకారం కాకపోవడం దారుణమన్నారు కోమటిరెడ్డి. డీఎస్సీ వేయకపోవడం వలన నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. అలాగే 70 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని చెబుతున్నారని.. కేసీఅర్ మరో మోసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన జిల్లాకే ముఖ్యమంత్రి తప్ప.. రాష్ట్రానికి కాదని ఎద్దేవ చేశారు.
అంతకుముందు.. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పెట్టిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారు కోమటిరెడ్డి. ప్రభుత్వ భవనాలకు పార్టీ ఫ్లెక్సీలు పెట్టడం ఎంటని అధికారులపై మండిపడ్డారు.