– కాంగ్రెస్ లో రచ్చలేపిన రాజగోపాల్ రెడ్డి
– అధిష్టానం ఫోకస్.. ఏ క్షణమైనా చర్యలు
– హస్తం నేతల గరంగరం
– ఇదే అదునుగా బీజేపీ గాలం
– రాజగోపాల్ పై బండి, ఈటల ప్రశంసలు
– మధ్యలో ఎంటరై షర్మిల సెటైర్లు
అమిత్ షాను కలిసింది వాస్తవమే.. కానీ.. పార్టీ మార్పుపై చర్చించలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కానీ.. ప్రెస్ మీట్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పుడు వాటిపైనే కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పైగా హస్తం నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజగోపాల్ రెడ్డిపై విమర్శల దాడి స్టార్ట్ చేశారు. కొందరైతే ఫిర్యాదులు కూడా పంపినట్లు వార్తలొస్తున్నాయి.
రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే?
ఢిల్లీలో అమిత్ షాను కలిశా.. అందులో తప్పేముంది. సోనియా గాంధీ ఈడీ విచారణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. పార్టీ మారడం చారిత్రక అవసరం. పార్టీ మారాల్సి వస్తే.. తప్పకుండా ప్రజలతో చర్చిస్తా. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారతాయి. పార్టీ బలహీనపడింది. కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకి ఉంది. జైలుకు వెళ్లి వచ్చిన వారితో నీతులు చెప్పించుకోలేను. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుంది.
అధిష్టానం సీరియస్!
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈడీ విచారణ, పీసీసీ జైలు అంశం, కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజీపీకే ఉంది అనే వ్యాఖ్యలపై పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటు హస్తం నేతలు రాజగోపాల్ రెడ్డిపై గరంగరంగా ఉన్నారు. సైలెంట్ గా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై వీహెచ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం అభివృద్ధి చేసిందని బీజేపీలో చేరుతారో తెలియడం లేదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిని వదిలేసిన వాళ్లు చరిత్రహీనులు అవుతారంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ తల్లి అని అన్నారు. ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి చురకలంటించారు.
ఈటల, బండి ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై రచ్చ కొనసాగుతుండగా.. బీజేపీ పెద్దలు ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని.. ఆయన బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక బండి సంజయ్ స్పందిస్తూ.. కోమటిరెడ్డి కమిట్మెంట్ ఉన్న నాయకుడని కొనియాడారు. టీఆర్‌ఎస్ ను ఓడించాలనే కసితో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు తెలిపారు. వీరి కామెంట్స్ తో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనేది స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
షర్మిల సెటైర్లు
మునుగోడులో ఉప ఎన్నికలు కొందరి స్వార్థం కోసమే వచ్చేలా ఉన్నాయని అన్నారు షర్మిల. ఇష్టం వచ్చినట్లు రాజీనామాలు చేయడం, నచ్చిన పార్టీలోకి వెళ్లడం వల్లే ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాళ్లకు కోట్లలో ఫైన్ వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.