కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట వార్తల్లో నిలుస్తుంది. ఆ మాట సొంత కాంగ్రెస్ పార్టీకి తల నొప్పులు తెచ్చిపెడుతుంది.తాజాగా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం దండు మల్కాపురం లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ యువకుడు…విదేశాల్లో చదువుకున్నాడు. ప్రపంచమంతా తిరిగి ఎంతో అనుభవం సంపాదించాడు.అలాంటి వ్యక్తి మనకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టం..ఆయన వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఇక ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కడా ప్రభుత్వంపై విమర్శలకు పోలేదు.స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి రాజకీయ విమర్శలు పెద్దగా చేయరు.కానీ ప్రభుత్వానికి అనుకూలంగా, మంత్రిని పొగుడుతూ మాట్లాడడం చర్చకు దారి తీసింది.
రాజగోపాల్ రెడ్డి గతంలో టీఆరెఎస్ కు అనుకూలంగా,ఇంకోసారి బీజేపీ కి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇదంతా సొంత అవసరాల కోసం చేసిన వ్యాఖ్యలు గా కొందరు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ కీలకం.ఇప్పటికే వివిధ ప్రాజెక్ట్ లకు సంబంధించిన బిల్లులు కోమటిరెడ్డి వి పెండింగ్ లో ఉన్నాయని, వాటి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల టాక్. గతంలో కూడా కాంగ్రెస్ ను విమర్శిస్తూ టీఆరెఎస్ ప్రభుత్వాన్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి.మరి కొందరు మాత్రం టీఆరెఎస్ పార్టీలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ఇవన్నీ పరిణామాలు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారుతున్నాయి.ఒకవైపు ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పోరాడుతోంది.కెసిఆర్ కుటుంబం ప్రధానంగా రాజకీయ విమర్సలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కానీ రాజగోపాల్ రెడ్డి ఏకంగా కేటీఆర్ ను పొగడడం తో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.