తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తమ పార్టీలో చేరేందుకు మునుగోడులో ఓ వ్యక్తికి బీజేపీ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా? అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రియాక్ట్ అయ్యారు.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. కేటీఆర్ కు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే నేను బీజేపీలో చేరినందుకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పొందానని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
గోబెల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే అది తన విషయంలో కుదరని పని అని గుర్తించుకోవాలని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కాగా గురువారం ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలు లేకుండా చేయాలనేదే మోడీ ప్రధాన ఉద్దేశమని కామెంట్స్ చేశారు. అవినీతి ఆరోపణలున్న అనేక మంది బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారని తీవ్రంగా విమర్శించారు.