సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరలేపారన్నారు. లిక్కర్ స్కామ్ లో జైలుకు పోతామనే భయంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏమీ ఎలగబెట్టనోడు దేశాన్ని ఉద్దరిస్తాడా? అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ ది అంతా ఓ డ్రామా అన్నారు. తెలంగాణలో రాచరిక పాలన అంతం కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు.
మునుగోడులో బీజేపీ గెలిస్తే.. దేశ చరిత్రలో మునుగోడు ప్రజలు చరిత్రకారులయ్యేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ బాధ్యత అప్పచెప్పినా కట్టుబడి పనిచేస్తానని.. పదవుల కోసం కాకుండా మునుగోడు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు.
ఐదు వేల మంది ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ మొత్తం తమను మునుగోడులో ఓడగొట్టడానికి పనిచేశారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.