– కేసీఆర్ ను గద్దె దించే సత్తా బీజేపీ కే ఉంది
– జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది
– నేను బీజేపీతో లాలూచీ పడ్డానని నిరూపిస్తారా?
– నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా?
– తొలివెలుగుతో కీలక విషయాలు పంచుకున్న రాజగోపాల్ రెడ్డి
నాలుగు రోజులుగా తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించే చర్చ. ఆయన కాంగ్రెస్ లో ఉంటారా? వెళ్లిపోతారా? బీజేపీలో చేరుతున్నారా? ముహూర్తం ఎప్పుడు? ఇలా ఎన్నో రకాల విషయాలు తెరపైకి వచ్చాయి. కాంట్రాక్టుల విషయంలో బీజేపీతో లాలూచీ పడి రాజగోపాల్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తొలివెలుగు ఆయన్ను సంప్రదించగా.. కీలక విషయాలు బయటపెట్టారు.
నాలుగు రోజులుగా 15 వందల ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వస్తే లాభం జరుగుతుందా? వేల కోట్ల నిధులు విడుదలవుతాయా? అనే అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. ఇంకో ఏడాదిన్నర తాను కొనసాగినా ఉపయోగం లేదని.. సీఎం నిధులు విడుదల చేయరని ఆరోపించారు. అభివృద్ధి కోసం రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. దానిపైనే చర్చలు జరిపామన్న ఆయన.. ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కేసీఆర్ ని గద్దె దింపాలంటే అది కేంద్రంలోని మోడీ, షా వల్లే సాధ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకుందని.. దాన్ని కాపాడాలనేదే తన ప్రయత్నంగా చెప్పుకొచ్చారు. అవసరమైతే పార్టీ మారి ప్రజాతీర్పు కోరి ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని తెలిపారు. ఎవరూ తనకు క్షమాపణ, బుజ్జగించాల్సిన అవసరం లేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ని గద్దె దించే శక్తి కాంగ్రెస్ కు లేదని తేల్చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీసుకురావాలన్నా, శిక్షించాలన్నా బీజేపీకే సాధ్యమని వివరించారు.
మునుగోడులో బీజేపీ బలంగా ఉందా? అని ప్రశ్నించగా… ‘‘హుజూరాబాద్ లో ఉందా? ఒకప్పుడు టీడీపీ హవా నడిచింది.. ఇప్పుడు ఉందా? రోజులు మారాయి.. మనం కూడా మారాలి’’ అని వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. అలాగే ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండేదని.. ఇప్పుడు బీజేపీ బ్రహ్మాండంగా హవా కొనసాగిస్తోందని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని ఓ వర్గం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తొలివెలుగు ద్వారా తాను చెప్పేది ఒక్కటేనని.. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. స్వార్ధం కోసం తాను ప్రయత్నాలు చేయనని.. ఏం చేసినా ప్రజల కోసమేనన్నారు.
బీజేపీకి దగ్గరగా ఉంటూ కాంట్రాక్టులు దక్కించుకున్నారని ప్రశ్నించగా.. కేంద్రానికి సంబంధించి ఏ టెండర్ అయినా ఆన్ లైన్ లో ఉంటుందని చెప్పారు. కాంపిటీషన్ లోనే తమ కంపెనీకి కాంట్రాక్ట్ దక్కిందని వివరించారు. ఆ విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్తే.. ఓడించలేం అని అనుకుంటున్న వ్యక్తులు దొంగ చాటు దెబ్బ కొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. తనను గెలిపించిన ప్రజలు తల వంచుకునే పని ఎప్పటికీ చేయనన్న రాజగోపాల్ రెడ్డి.. అటువంటి పరిస్థితే వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.