హైదరాబాద్ : ఉత్తమ్, కుంతియా ఉన్నన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు వీడాక కాంగ్రెస్ ఖేల్ ఖతమైందని అన్నారు. సాధు జంతువులాంటి కాంగ్రెస్‌ను చంపేసిన కేసీఆర్ పులిలాంటి బీజేపీని బలపర్చారని కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సాంకేతికంగా వచ్చే నాలుగేళ్లు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ కమలం పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని తేల్చారు. ‘ఉత్తమ్, కుంతియా ఉన్నన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు.. వాళ్లు పక్కకు జరిగితేనే పార్టీ కి భవిష్యత్..’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే గడ్డం తీసేస్తానని చెప్పిన ఉత్తమ్ ఇంకా గడ్డంతోనే తిరుగుతున్నాడని అన్నారు. అలాంటి ఉత్తమ్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయమని చెప్పారు. ‘తెలంగాణలో బీజేపీ బలపడుతుందని నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పాను. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారికంగా ప్రకటించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతా..’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపోటములు ఉత్తమ్‌పై ఆధారపడి ఉంటాయని, హుజూర్‌నగర్‌లో నా మద్దతు ఎవరికనేది ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తానని కోమటిరెడ్డి అన్నారు. దిండీ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్‌రావును కలిశానని, కాలేజీ రోజుల నుంచి తాను, హరీష్ మంచి మిత్రులమని తెలిపారు.