నల్గొండ పంచాయితీ రాజ్ సమ్మేళనం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు వేదికపైకి దూసుకువచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
బుధవారం నల్గొండలో పంచాయతీ రాజ్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. దాంతో నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కల్పించుకొని ప్రభుత్వము చేస్తోన్న అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షం విమర్శలకు దిగుతుందనిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని.. ఎమ్మెల్యేగా తనకు అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందంటూ చెప్పడంతో.. అక్కడే ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వారిద్దరిని వారించేందుకు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే భాస్కర్ రావులు ప్రయత్నించారు. ఈక్రమంలోనే వారిద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రం కావడంతో రెండు పార్టీల కార్యకర్తలు వేదికపైకి దూసుకువచ్చారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను సముదాయించారు.