మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ప్రచారం జోరు రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదోక రూపంలో నిరసన సెగ తగులుతూనే ఉంది.
నిలదీతలు, అడ్డగింతలు సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా ఆ నిరసన సెగ కోమటి రెడ్డి సతీమణి లక్ష్మికి తాకింది. ఆమెతో పాటు ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో చుక్కెదురైంది.
డీకే అరుణతో కలిసి చిన్న కొండూరుకు వెళ్లిన లక్ష్మిని గ్రామస్థులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లక్ష్మి గో బ్యాక్… బీజేపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులు ఈ గ్రామంలోకి రావద్దు అంటూ అడ్డుకున్నారు.
గతంలో గ్రామాభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని నిలదీశారు. టీఆర్ ఎస్ మీద విమర్శలు చేయబోయిన డీకే అరుణ పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లక్ష్మి తన ప్రచారం తూతూ మంత్రంగా చేసి వెనుతిరిగి వెళ్లారు.
పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ గ్రామంలోనికి రావొద్దని కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు.