సొంత పార్టీ నేతపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. అవి తాను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే కానీ, వేరే ఉద్దేశం లేదన్నారు. 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించింది లేదని గుర్తు చేశారు. తనది శత్రువులను కూడా దగ్గర తీసే తత్వమని వ్యాఖ్యానించారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానన్న ఆయన.. కలలో కూడా తాను ఏ కులాన్ని కించపరచనని అన్నారు.
చదువుకున్న వ్యక్తిగా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇప్పించానని.. నల్లగొండ మున్సిపాలిటీ పదవి జనరల్ అయినప్పటికీ మూడు సార్లు పట్టుబట్టి బడుగు బలహీన వర్గాల వారికే దక్కేలా చేశానని వివరించారు. తాను మాట్లాడిన విషయాలు కట్ చేశారన్న వెంకట్ రెడ్డి.. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారని తెలిపారు. తన ఫోన్ కాల్ ను రికార్డ్ పెట్టారని తెలుసన్న ఆయన.. పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి సుధాకర్ తనను తిడుతున్నారని వాపోయారు.
ఆయన పదేపదే తనను ఎందుకు తిడుతున్నారని అడిగానని అన్నారు కోమటిరెడ్డి. ఒకప్పుడు చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెడితే.. తానే కొట్లాడానని గుర్తు చేశారు. తనను తిట్టొద్దని మాత్రమే ఆయన కుమారుడికి చెప్పానని.. ప్రజలు దీనిని మరోలా అర్థం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. తనను సస్పెండ్ చేయాలి, దరిద్రులు అనడం వల్లే భాధతో అలా మాట్లాడానని వివరించారు.
నకిరేకల్ లో తనపై పోస్టర్లు వేశారని.. ఆ పని ఎవరు చేశారో తెలుసన్నారు కోమటిరెడ్డి. తన అభిమానులు చంపేస్తారేమోనని భయంతోనే అలా మాట్లాడానని తెలిపారు. తనపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు, రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనను తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని.. వీడు, వాడు అని పదేపదే సంబోదించవచ్చా అని ప్రశ్నించారు వెంకట్ రెడ్డి.