కోవర్ట్ రెడ్డి అంటూ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భాష జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నిజాయితీతో నిప్పులా బతికానని.. కల్వకుంట్ల కుటుంబంలా కమీషన్లతో కాదన్నారు. అసలు కోవర్ట్ అనే పదం వాడడానికి కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటన్న ఆయన.. అసలు.. తనను అనడానికి నీ స్థాయి ఏంటని మండిపడ్డారు. రాజకీయమంటే అప్పనంగా అధికారం అనుభవిస్తూ.. కోట్ల అవినీతి చేయడం కాదన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే.. విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయడం అసలే కాదని సెటైర్లు వేశారు. ఏ ఒక్క అమరుడి ఇంటికైనా.. ఒక్కసారైనా వెళితే కేటీఆర్ కు నాయకుడంటే ఎలా ఉండాలో తెలిసేదన్నారు.
తెలంగాణ కోసం ఏం చేశావని నన్ను కోవర్ట్ అని అంటావ్ అంటూ మండిపడ్డారు వెంకట్ రెడ్డి. ‘‘నీ భాష ఏంటి..? నీ పద్దతేంటి? ఇంతకీ.. నువ్వు చదివింది అమెరికాలోనా? గుంటూరు గల్లీలోనా? అసలు.. నీకు తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసా? ఎవరెవరు ప్రాణత్యాగానికి సిద్ధపడితే.. ఎందరు ప్రాణత్యాగం చేస్తే వచ్చిందో తెలుసా? అసలు.. తెలంగాణ సాధన కోసం మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న నాయకుడు ఎవరో తెలుసా? తెలీకుంటే.. తెలంగాణలో చిన్న పిల్లవాడినైనా అడుగు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని చెప్తాడు. నేను ఉద్యమం చేసే రోజుల్లో నువ్వు నిక్కర్లో ఆడుకుంటున్నావేమో. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకుంటే.. నేను చేపట్టిన ఉద్యమం ఉప్పెనై రగిలితే.. తెలంగాణ వచ్చిందనే విషయం తెలీకుంటే అడిగి తెలుసుకో. నా ఆమరణ దీక్ష భగ్నంతో రగిలిన జనం.. నేషనల్ హైవేలను దిగ్బంధిస్తే కానీ ఢిల్లీ తలవంచలేదనే విషయం ఫాంహౌస్ లో ఎంజాయ్ చేసే నీకెలా తెలుస్తుంది’’ అని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు వెంకట్ రెడ్డి.
సాగరహారంలో తనను తాకిన రబ్బరు బుల్లెట్లను అడుగు.. ఆనాడు నా వెంట నడిచిన లక్షలాది జనాన్ని అడుగు.. ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజా నాయకులో ఎవరు కోట్లు వెనకేసుకున్న కోవర్టులో తెలుస్తుందని ఘాటుగానే స్పందించారు. ఇక తనను అనేముందు నీ చెల్లెలి సంగతి చూసుకో అని కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కోడై కూస్తున్న నేషనల్ మీడియాను అడగాలని.. అప్పుటు కోవర్టులు ఎవరో తెలుస్తుందన్నారు. ‘‘నమ్మి నెత్తిన పెట్టుకున్న తెలంగాణ జనాన్ని నిండా ముంచి.. ఢిల్లీతో సెటిల్మెంట్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్న కోవర్టులు ఎవరు? ప్రతిరోజూ ఈడీ రెయిడ్స్, ఐటీ రెయిడ్స్ ఎవరి అనుచరుల కంపెనీల మీద జరుగుతున్నాయో.. ఎవరు అరెస్ట్ అవుతున్నారో..? రోజూ న్యూస్ చూసే ఎవరినైనా అడుగు. అయినా.. నీ మీద ఈగ వాలదు. ఎందుకని కేటీఆర్? ఇవి చాలదా కోవర్టులెవరో తెలియడానికి? ఎక్కడ ఎవరికి పేరొస్తుందో అని నల్గొండ జనానికి తాగునీరు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. అంతంతెదుకు.. మీ నాయిననడుగు..? ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య మీద 13 రోజులు నిరాహార దీక్ష చేశా. గత 40 ఏళ్ళుగా ఫ్లోరైడ్ సమస్య మీద ఏ నాయకుడూ చేయని పోరాటం చేశా. ఆ సంగతి ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలని అడుగు’’ అంటూ ఫైరయ్యారు వెంకట్ రెడ్డి.
నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులకి అండగా నిలబడ్డది తానైతే.. వాళ్లకు తాగునీళ్లు లేకుండా చేస్తున్నది మీరేనని ప్రజలకు బాగా తెలుసన్నారు. మీవైపు ఇన్ని తప్పులు పెట్టుకుని.. తెలంగాణ ఉద్యమ సారథిని, ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డ తనను కోవర్ట్ అని అనడానికి సిగ్గుగా లేదా? అని కడిగిపారేశారు. అసలు.. తనపై బురద జల్లుకుతున్న కేటీఆర్ కు ఇంత వైభోగమెలా వచ్చిందని ప్రశ్నించారు. ఒకప్పుడు పట్టుమని పదెకరాలు లేవని.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒట్టేసి చెప్పే దమ్ము నీకుందా? కేటీఆర్ అని సవాల్ చేశారు. మీ అవినీతికి, స్కాములకి నువ్వు కోవర్డువి కాకుంటే ఈ పాటికే జైల్లో ఉండే వాడివని విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ లోనూ కల్వకుంట్ల ఫ్యామిలీ కమీషన్లు బొక్కేసిందని ఆరోపించారు. కోమటిరెడ్డి నిజాయితీకి మారు పేరు అయితే.. కల్వకుంట్ల కమీషన్లకు మారు పేరని చురకలంటించారు. ఇది కాదని చెప్పే దమ్ము కేటీఆర్ కు ఉందా అని అడిగారు. యాదగిరి గుట్ట.. భాగ్యలక్ష్మి ఆలయం.. వరంగల్ భద్రకాళి.. బాసర సరస్వతి ఆలయం.. ఇలా ఎక్కడికైనా ఎప్పుడైనా వస్తానని కేటీఆర్ కూడా రెడీనా అని సవాల్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.