మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాలో మంత్రి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నార్కట్ పల్లి చెరువును కబ్జా పెట్టారని అన్నారు. మంత్రి బినామీ జీవన్ రెడ్డి పేరు మీద అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సర్వే నెంబర్ 480, 481,550 లోని భూమిని కబ్జా పెట్టారన్నారు.
దాదాపు 20 ఎకరాల బంజరు భూమి, బఫర్ జోన్ లోని 10 ఎకరాల భూమిని మంత్రి ఆక్రమించారని వివరించారు కోమటిరెడ్డి. సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న జగదీశ్ రెడ్డి… కలెక్టరేట్ నిర్మాణం పేరుతో దళితుల నుంచి 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. అలాగే జాజిరెడ్డిగూడెం, వంగమర్తి ఇసుక క్వారీల పేరు మీద రోజూ 20 నుంచి 30 లక్షల రూపాయల ఇసుకను తరలిస్తున్నారని వివరించారు.
మంత్రి కబ్జాల గురించి జిల్లా కలెక్టర్ అన్నీ వివరించామన్నారు కోమటిరెడ్డి. దీనిపై అధికారులు స్పందించకుంటే నార్కట్ పల్లి గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి చెరువులో అక్రమంగా వేసిన రోడ్డును తొలగిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అవినీతి మంత్రిని ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి చేతకానితనం వల్ల జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు కోమటిరెడ్డి.
మరోవైపు ఎంపీ ఆరోపణలతో ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. హడావిడిగా నార్కట్ పల్లిలో కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం.