– కాంగ్రెస్ లో మళ్లీ ఫిర్యాదుల గోల
– రేవంత్ కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి పావులు
– కోవర్ట్ పోస్టర్లపై సీరియస్ గా ఉన్న ఎంపీ
– అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు
– పీసీసీ పదవుల విషయంలోనూ సైలెంట్ వ్యూహాలు
ఈమధ్యే గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుసుకున్నారు. మాణిక్ రావు ఎంట్రీతో పంచాయితీలన్నీ సద్దుమణిగాయి అందరూ కలిసిపోయారు అని అనుకున్నారంతా. పైగా, రేవంత్, కోమటిరెడ్డి నవ్వుతూ మాట్లాడుకోవడం.. ఆప్యాయంగా పలకరించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అయితే.. ఇది మూణ్ణాళ్ల ముచ్చట మాదిరిగా మారిపోయింది. మళ్లీ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిగా పంచాయితీ నడుస్తోందని తీవ్ర చర్చ జరుగుతోంది.
బడ్జెట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ ఎంపీలు. ఈ సందర్భంగా వారితో విడివిడిగా అధిష్టానం భేటీ అయింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి.. రేవంత్ పై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ లో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల అంశంపై కంప్లయింట్ చేసినట్టు సమాచారం. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నా కూడా తనపై కోవర్టు ముద్ర వేస్తున్నారని కోమటిరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారని వార్తలు వస్తున్నాయి. రేవంత్ సూచనల మేరకు వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం నేతృత్వంలోనే ఈ పోస్టర్ల ముద్రణ జరిగిందని చెప్పారట వెంకట్ రెడ్డి.
గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల కొత్త ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఇద్దరు నేతలు భేటీ అయి అందరినీ ఆశ్చర్య పరిచారు. అనూహ్యంగా వీరిద్దరు కలిసిపోవడంతో ఇక ముందు కూడా ఐక్యమత్యంగా కలిసి పని చేయబోతున్నట్లు హస్తం పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే తనను కోవర్ట్ అని ముద్ర వేస్తూ పోస్టర్లు వేయడం వెంకట్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందని.. మళ్లీ పంచాయితీ మొదటికొచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు, టీపీసీసీలో తన వర్గం వారు కూడా పదవుల్లో ఉండేలా అధిష్టానం వద్ద కోమటిరెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, 23 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 84 మంది జనరల్ సెక్రటరీలు, 26 మంది జిల్లా అధ్యక్షులను నియమించింది. ఈ కమిటీల్లో తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారంటూ సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించారు. దీంతో రేవంత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సీతక్క సహా 13 మంది తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
అయితే.. రాజీనామా చేసిన రేవంత్ వర్గీయులు తిరిగి ఆ పదవులు తమకే కేటాయించాలని కోరుతున్నారట. ఇదే అదునుగా కోమటిరెడ్డి పీసీసీ కమిటీల్లో తన వర్గీయులను నియమించేలా అధిష్టానం వద్ద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పీసీసీ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అయినా లేదా కొత్తగా విస్తరించి అయినా తన వర్గీయులకు స్థానం కల్పించాలని ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టర్ల విషయంలో రేవంత్ తో మాట్లాడతామన్న అధిష్టానం.. పీసీసీ పదవుల విషయంలో కోమటిరెడ్డికి గుడ్ న్యూస్ చెబుతుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.