యాదాద్రిలో చిన్నపాటి వర్షానికే పునర్నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం బయటపడడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ పై ఫైరయ్యారు. ఆలయ పనులపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వరదల మాదిరి వర్షం పడినట్లయితే.. గుడి కూడా కూలిపోయేదేమోనని అన్నారు.
రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారైందని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఈ లెక్కన 8 ఏళ్లుగా కేసీఆర్ 20 సార్లు వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఎవరు? పనుల పేరుతో ఎవరెవరు ఎంత దోచుకున్నారో.. నాణ్యతకు సంబంధించి విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి, విజిలెన్స్ అధికారులకు లేఖ రాస్తానని తెలిపారు.
ముఖ్యమంత్రి ఫాంహౌస్ లో ఉన్నారని.. వెంటనే యాదాద్రి వచ్చి పరిశీలించాలన్నారు కోమటిరెడ్డి. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి రాష్ట్ర పరువు తీసిందని విమర్శించారు. ఇంత జరిగినా కూడా దేవాదాయశాఖ మంత్రి గానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇక.. రాహుల్ పర్యటనపై హరీష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. హరీష్ రావుకు మంత్రి పదవి కాంగ్రెస్ పుణ్యం వల్లే వచ్చిందని సెటైర్లు వేశారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని.. ఆమె స్థానంలో ఎవరు ఉన్న తెలంగాణ రాదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పలేదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి సోనియా, రాహుల్ గాంధీకి హక్కు ఉందన్నారు కోమటిరెడ్డి.