రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ నేతలు ఆయనపై ఎటాక్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే.. వాటిలోని కొన్ని వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ తప్పుగా మాట్లాడారని.. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అనవసరంగా తనను రెచ్చగొట్టొదన్న వెంకట్ రెడ్డి.. మాట అంటే పడేవాన్ని కాదని అన్నారు. బ్రాండ్ కాదు బ్రాందీ అని ఎలా అంటారని.. తామేమన్నా బ్రాందీ షాప్ పెట్టుకునే వాళ్ళమా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లోకి వచ్చే నాటికి రేవంత్ పుట్టలేదని.. ఆయన కామెంట్స్ చాలా బాధించాయని తెలిపారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీగా ఉన్నారని.. 34 ఏళ్లుగా పార్టీ కోసం తన రక్తం ధారపోశానన్నారు వెంకట్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి రేవంత్ కాంగ్రెస్ లో చేరింది నిజం కాదా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి వెళ్లి పోరాటం చేస్తున్నారని.. వేరే పార్టీలోకి వెళ్తే తనకేం సంబంధమన్నారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని తేల్చిచెప్పారు.
పార్టీ ఏం ఆదేశిస్తే అది పాటిస్తానన్న వెంకట్ రెడ్డి.. మునుగోడు సంగతి అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీ చూసుకుంటుందని తెలిపారు. చాలా కుటుంబాల్లోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.