రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ గుంజుకుంటుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పెద్ద అంబర్ పేట్ కుంట్లూర్ లోని సర్వే నంబర్ 101, 106లో దళితులు నిర్మించుకున్న నిర్మాణాలను రెవిన్యూ అధికారులు కూల్చి వేయడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులు చేపట్టిన నిరవధిక దీక్షకు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి కోమటిరెడ్డి మద్దతు తెలిపారు.
పేదలకు, దళితులకు కాంగ్రెస్ పార్టీ విలువైన భూములు ఇస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దళితులు ఆర్థికంగా విలువైన భూముల్లో ఉండటం చూసిన టీఆర్ఎస్ సర్కార్ కు కళ్లుమండుతున్నాయన్నారు.
ఇదిలా ఉంటే.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. 2023 శాసనసభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డిని నియమిస్తున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా పీసీసీ అధ్యక్ష పీఠం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. చివరికి ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. చివరకు ఇద్దరు కలిసిపోయారు. కోమటిరెడ్డి అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.