– నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో మీటింగా?
– కాంగ్రెస్ వాళ్లను వెళ్లగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?
– కాంగ్రెస్ వాళ్లంతా పోతే.. టీడీపీ వాళ్లను తెస్తారా?
– అమిత్ షాతో భేటీ తర్వాత వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రమంత్రి అమిత్ షాను కాంగ్రెస్ ఎంపీ కలుస్తున్నారనే సరికి కళ్లన్నీ అటువైపే ఉన్నాయి. మునుగోడు రాజకీయం నడుస్తున్న ఈ తరుణంలో వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయింది. అయితే.. తమ మధ్య తెలంగాణ వరదలపై మాత్రమే చర్చ నడిచిందని వెంకట్ రెడ్డి వివరించారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వరదలతో రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వెంకట్ రెడ్డి. తాను ఇక్కడ బిజీగా ఉంటే.. మునుగోడులో రేవంత్ రెడ్డి మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. తన లోక్ సభ పరిధిలో తనను అడగకుండా మీటింగ్ ఏంటని నిలదీశారు. పైగా.. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దాసోజు శ్రవణ్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నించిన వెంకట్ రెడ్డి.. పాత కాంగ్రెస్ వాళ్లనంతా పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు.
తనను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే.. టీడీపీ వాళ్లను చేర్చుకుంటారా? అని ప్రశ్నించారు వెంకట్ రెడ్డి. తాను పార్టీ మారేది ఉంటే బరాబర్ చెప్పేపోతానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడనని.. పరోక్షంగా రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
ఇక హుజూరాబాద్ అంశాన్ని గుర్తు చేశారు వెంకట్ రెడ్డి. మునుగోడులో రాజగోపాల్ రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేసిన వెంటనే మీటింగ్ ఏర్పాటు చేశారని.. హుజూరాబాద్ లో ఎన్ని రోజుల తర్వాత సభ పెట్టారని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో కూడా ఈ విధంగా రేవంత్ ఎందుకు రియాక్ట్ కాలేదని నిలదీశారు.