– థాక్రేతో కోమటిరెడ్డి భేటీ
– పొత్తుల ఇష్యూపై మాట్లాడుకున్నారా?
– బైక్ యాత్రపై చర్చించారా?
పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో గందరగోళానికి దారితీశాయి. పార్టీ నేతలు ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. హాత్ సే యాత్రతో జనంలోకి వెళ్తున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యాలు నష్టాన్ని తెచ్చి పెడతాయని అన్నారు. అయితే.. వెంకట్ రెడ్డి మాత్రం తాను మాట్లాడింది వేరు.. బయట సర్క్యులేట్ అవుతోంది వేరని అంటున్నారు. ఈ పంచాయితీ కొనసాగుతుండగానే.. పార్టీ ఇంచార్జ్ థాక్రేతో కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది.
పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చారు మాణిక్ రావు థాక్రే. కోమటిరెడ్డి వ్యాఖ్యల దుమారం చెలరేగడంతో దీనికి ఫులిస్టాప్ పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోమటిరెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వీరిద్దరి భేటీకి వేదికైంది. వెంకట్ రెడ్డితో భేటీకి ముందు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ కార్యదర్శులతో థాక్రే సమావేశమయ్యారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారితో చర్చించారు.
థాక్రేతో భేటీ తర్వాత బయటకొచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మరోసారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను థాక్రే లైట్ తీసుకున్నారని చెప్పారు. ఆ ఇష్యూపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తమ పార్టీ వాళ్లు కూడా వీడియో పూర్తిగా చూడలేదని.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదనే తాను చెప్పానని వివరించారు. ఐదు నెలలకు ముందే క్యాండేట్లకు టికెట్లు ఇవ్వాలన్నారు. గతంలో టీడీపీతో పొత్తుతో నష్టం జరిగిందని.. తాను మాట్లాడిన మాటల్లో తప్పులేదని చెప్పారు.
సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిపారు కోమటిరెడ్డి. నెలఖారులో 3 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో కేసీఆర్ కలవక తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. అయితే.. హైదరాబాద్ వచ్చాక.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాను చెప్పానని అన్నారు.