– ఎట్టకేలకు కలిసిన నేతలు
– రాష్ట్రానికి మాణిక్ రావు రాక
– గాంధీ భవన్ కు వెళ్లిన కోమటిరెడ్డి
– రేవంత్ తోనూ ప్రత్యేక చర్చలు
– ఇద్దరి నేతల కలయికతో హస్తం శ్రేణుల్లో ఉత్సాహం
– థాక్రేతోనూ మంతనాలు
వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో ఓ యుద్ధమే జరుగుతుంటుంది. ఇద్దరు కలిసి పాల్గొన్న కార్యక్రమాలూ తక్కువే. ఎడమొహం పెడమొహంగా ఉండే వాళ్లిద్దరే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి. పార్టీ అధ్యక్ష పదవి కోసం వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. కానీ, అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపింది. ఆ సమయంలో కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కను అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఈమధ్య పార్టీకి కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావు థాక్రే నియామకం అయ్యారు. ఆయన తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనూ గాంధీ భవన్ కు రావాలని కోరారు. కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే వీరిద్దరూ భేటీ అయ్యారు. దీంతో కోమటిరెడ్డి గాంధీ భవన్ మెట్లు ఎక్కుతారా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే.. వాటన్నింటికీ ఆన్సర్ గా ఎట్టకేలకు గాంధీ భవన్ కు వెళ్లారు వెంకట్ రెడ్డి. అంతేకాదు.. రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఏదో ఎదురుపడినట్లు కాకుండా.. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరి వీళ్లిద్దరూ ప్రవర్తించారు.
మాణిక్ రావు థాక్రే శుక్రవారం తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, హాథ్ సే జోడో కార్యక్రమంపై చర్చించారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా పీసీసీ కార్యాలయం నుంచి కోమటిరెడ్డికి ఫోన్ వెళ్లింది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత ఆయన గాంధీ భవన్ మెట్లెక్కారు. రేవంత్ రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరు మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మాణిక్ రావు థ్రాకే పిలవడంతోనే తాను గాంధీభవన్ కు వచ్చానని కోమటిరెడ్డి తెలిపారు. గతంలో గాంధీభవన్ మెట్లు ఎక్కనని చేసిన శపథం గురించి మీడియా అడగగా.. తాను అలా అనలేదని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా గాంధీ వన్ తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా రావాలన్న అంశంపై దృష్టి పెట్టినట్టు వివరించారు వెంకట్ రెడ్డి.