నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని.. వేరే నేత వచ్చి నల్గొండలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌లో సమీక్షలు పెట్టుకుంటే మంచిదని సూచించారు.
రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణమని అన్న కోమటిరెడ్డి.. తన నియోజకవర్గంలో గడ్కరీ కార్యక్రమాలు ఉండటం వల్ల నల్గొండలో రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కావట్లేదన్నారు.
గడిచిన ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆరాటాలు ఆర్భాటాలతో ప్లీనరీలు నిర్వహించిందని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగి వరి కోతలు ప్రారంభమైనప్పటికీ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్య దోరణికి అద్దం పట్టినట్టు ఉందని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని మండిపడ్డారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని.. కక్షపూరితంగా నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదని విమర్శించారు.