ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్ లో చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనర్హుడిగా ప్రకటించి రాహుల్ గొంతునొక్కారని విమర్శించారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై అనర్హత అన్యాయం, అక్రమమని అన్నారు వెంకట్ రెడ్డి. ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆయన జోడో యాత్ర చేశారని.. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా వద్దన్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీపై కుట్ర జరుగుతోందన్న ఆయన.. అదానీ అంశం గురించి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటినుంచి ప్లాన్ మొదలైందని చెప్పారు. అదానీ గురించి అంతా బయటపెడతారని ఈ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు అనర్హత అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు.
రాహుల్ గాంధీ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే తామంతా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యులమంతా ఒకే మాటపై ఉంటామని తెలిపారు. కింది కోర్టు పైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినా.. ఆఘమేఘాల మీద డిస్ క్వాలిఫై చేయించారని మండిపడ్డారు.
బీజేపీ కుట్రలు ప్రపంచం మొత్తం తెలియాలన్న కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ మామూలు నాయకులు కాదన్నారు. బీజేపీ బండారం మొత్తం బయట పెడుతున్నారని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించారని తెలిపారు. బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. ఏం చేసినా నడుస్తుందనే భావనలో ఆపార్టీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ రాహుల్ వెన్నంటే అందరం ఉంటామని చెప్పారు ఎంపీ.