భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్తాపంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని ఓ ఎంపీగా పరామర్శించాను. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పి.. లక్ష రూపాల ఆర్ధిక సహాయాన్ని కూడా అందించాను. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
సాగర్ తండ్రి భద్రయ్య హమాలీ పని, తల్లి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాను. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 610 జీవోలో భాగంగా 70 వేల ఉద్యోగాలు ఆంధ్రకి తరలిపోయాయి. దొంగ దీక్షలు చేసి కేసీఆర్ అందరినీ మోసం చేశారు. ఇది న్యాయమేనా..? అని ప్రశ్నిస్తున్నాను.
నాకు పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎంపీ పదవులు మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాను. నిరుద్యోగ భృతి రూ.3116 ఇస్తానని చెప్పి మూడు సంవత్సరాలుగు మభ్య పెడుతున్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నిస్తున్నాను. దీనికి సీఎం కేసీఆర్ సమాదానం చెప్పాలి. ప్రతీ నిరుద్యోగికి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలపైనే బాకీ ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆరుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్ వేశారు. ఇంత మానవత్వం లేని ప్రభుత్వాన్ని నేనెప్పుడూ, ఎక్కడా చూడలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు మినిస్టర్ లకే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వరు. తన బిడ్డ, అల్లుడు, తెలంగాణను దోచుకుంటున్నారు. రాష్ట్రాన్ని వాళ్లకు దోచిపెట్టడమే కేసీఆర్ పని. దోచిందంతా దాచిపెట్టడం కోడుకు పని. రాష్ట్రాన్ని రాచరికపు బాటలో నడుపుతున్నారు. నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం కలిగించేలా త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలి.
కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడింది. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. ఒక్కొక్క నిరుద్యోగికి లక్ష రూపాలు కేసీఆర్ బాకీ పడ్డారు. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నిరుద్యోగ భృతి బాకీ డబ్బులు కూడా నిరుద్యోగులకు ఇవ్వాలి. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఓయూలో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతారా..? ఓ పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి సిగ్గుండాలి. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.