సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించటం, ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను లేఖలో వివరించారు.
రైతు లేనిదే రాజ్యం లేదని.. ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటున్నామని.. వారికి ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ.. భారంగా మారకూడదన్నారు వెంకట్ రెడ్డి. ఇప్పటికే వడ్ల కొనుగోలు విషయంలో రైతులు గందరగోళంలో ఉన్నారని.. ఈ పరిస్థితుల్లో కరెంట్ కోతలు విధించి వారిని ఇంకా బాధపెట్టొద్దని కోరారు. ఈ కోతలతో చేతికొచ్చిన పంట నీరు అందక ఎండిపోతుంటే రైతు కళ్లలో నుండి కన్నీరు కారుతోందని వివరించారు.
అవసరం అనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయాలని సూచించారు. రైతులకు 24 గంటల కరెంట్ కి అలవాటు చేసి.. ఇలా పంట చేతికొచ్చే సమయంలో కోతలు విధించడం ఏంటని ప్రశ్నించారు. మరో వైపు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. రూ.266 ఉన్న యూరియాపై రూ.50 పెంచడం దారుణమని.. పోటాష్ ధర కూడా రూ.885 ఉండగా రూ.1,700 చేసి ఒకేసారి రూ.815 పెంచారని మండిపడ్డారు.
Advertisements
ఇలా ఓవైపు ఎరువుల ధరలు పెంచుతూ.. ఇంకోవైపు కరెంట్ కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకొవద్దని సూచించారు. నేలతల్లిని నమ్ముకుని కష్టపడి బతికే రైతన్నలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని లేఖలో రాసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.