తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాటలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ డిసైడ్ అయ్యాయని ఆరోపించారు.
ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అని ప్రశ్నించారు. రెండు పార్టీలు ఒక్కటే.. డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అధికారం పంచుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి.. అని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పొత్తు అంటే సస్పెండ్ చేస్తా.. అని రాహుల్ గతంలో అన్నాడు.. మరి కోమటి రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు ఒకటేనని స్పష్టం అవుతుందని ఆరోపణలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఏపీలో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజన గ్రామాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ‘గిరిజన రిజర్వేషన్లు అమలు చెయ్.. రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా.. ‘అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. గిరిజన బంధు ఏమైందని ప్రశ్నించారు.
లిపి లేని సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సేవాలాల్ అని కొనియాడారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోడీ నిలబెట్టారని గుర్తుచేశారు. గిరిజన ద్రోహి కేసీఆర్ అని ..సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి,వర్థంతి కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కొండగట్టు ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని బండి డిమాండ్ చేశారు.