– కాంగ్రెస్ లో మాటలు మంటలు
– చెరుకు చేరికపై వెంకట్ రెడ్డి అసహనం
– రేవంత్ కు ప్రశ్నలు
ఢిల్లీలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. అయితే.. ఈ చేరికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెరుకు సుధాకర్ ను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని మండిపడ్డారు. తనని ఓడించేందుకే ఆయన ఎంతగానో ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది సుధాకర్ ను తీసుకురావడం ఏంటని.. రేవంత్ రెడ్డి తప్పు చేశారని విమర్శించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే రాజగోపాల్ వ్యవహారంతో కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంకట్ రెడ్డి కూడా స్వరం పెంచారు. మీరు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. ఈ వివాదానికి ఫులిస్టాప్ పెట్టాలని రేవంత్ ప్రయత్నించారు. కానీ.. ఆ వేదిక చెరుకు సుధాకర్ చేరిక కావడం కోమటిరెడ్డికి పుండు మీద కారం చల్లినట్లు అయిందని విశ్లేషకుల వాదన.
వెంకట్ రెడ్డి తమ వాడు అంటూ.. రాజగోపాల్ పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. అయితే.. ఓవైపు తనకు వ్యతిరేకమైన వ్యక్తిని చేర్చుకుంటూ ఇంకోవైపు పొగడ్తల వర్షం కురిపించడం వెంకట్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురి చేసి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అందుకే రేవంత్ కామెంట్ చేసిన వెంటనే రియాక్షన్ వచ్చిందని అంచనా వేస్తున్నారు. రాజగోపాల్ వ్యవహారం తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న వెంకట్ రెడ్డి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈయన కూడా జంప్ అవుతారా? అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ.. ఆయన మాత్రం అలాంటిదేం లేదని తేల్చారు.
జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే మాత్రం అనుమానాలు కలగకుండా ఉండడం లేదు. తమ్ముడి బాటలోనే నడుస్తారా? అందుకే స్వరం పెంచుతున్నారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చని అంటున్నారు విశ్లేషకులు.