– చెరుకు సుధాకర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్
– కుమారుడు సుహాస్ కి ఫోన్ చేసిన ఎంపీ
– నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని వార్నింగ్
– తన అభిమానులు చంపేస్తారని హెచ్చరిక
చెరుకు సుధాకర్.. కొన్నాళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈయనకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే టాక్ ఉంది. ఈయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఇతర పార్టీల నేతలపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అయితే.. చెరుకు చేరికను మొదట్నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలా జాయిన్ అయ్యారో లేదో.. వెంటనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో తనను ఓడిస్తానని సవాల్ చేసిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని.. రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు.
అయితే.. తాజాగా కోమటిరెడ్డి ఫోన్ కాల్ ఆడియో ఒకటి బయటకొచ్చింది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫోన్ చేసిన ఎంపీ.. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో లక్షల మందికి సాయం చేశానని అన్నారు. తనను ఏమైనా అంటే వారంతా ఊరుకుంటారా? చంపేస్తారు అంటూ హెచ్చరించారు. ఇప్పటికే చెరుకు సుధాకర్ ను చంపుతామని వంద వెహికిల్స్ తిరుగుతున్నాయని చెప్పారు.
వారం రోజుల్లోనే చంపేస్తారని.. పరుష పదజాలాన్ని వాడారు కోమటిరెడ్డి. నిన్ను కూడా లేపేస్తారు.. నీ హస్పిటల్ ఉండదు.. అంటూ సుహాస్ కి వార్నింగ్ ఇచ్చిన ఆడియో వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ లో మరో కొత్త పంచాయితీ మొదలైనట్టు అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఆమధ్య కోమటిరెడ్డి హంగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చెరుకు సుధాకర్.. ఇవి పార్టీకి నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తే.. పార్టీని వ్యతిరేకించినట్టు కాదా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డిని వ్యక్తిగతంగా అనాలని కాదని అంటూనే హంగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి ఇలా రియాక్ట్ అయి ఉంటారని అనుకుంటున్నారు.