తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపుఊపింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఓ సంచలనం సృష్టించింది ఈ చిత్రం. అయితే.. సుద్దాల అశోక్ తేజ రాసిన కొమురం భీముడో.. కొమురం భీముడో.. అనే పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
‘ఆర్‌ఆర్‌ఆర్’లో సినిమా మొత్తం ఒకెత్తు అయితే.. ఈ పాట ఒక్కటే ఒకెత్తు అంటున్నారు అభిమానులు. భావోద్వేగంగా సాగే ఈ పాటలో ఎన్టీఆర్ పండించిన హావభావాలు సాధారణ ప్రేక్షకుడి చేత కూడా కంటతడి పెట్టేలా చేశాయి. ఈ పాట మొదలైనప్పటి నుండి పూర్తి అయ్యేంత వరకు తారక్ నటన చూసి నిత్య జీవితంలో జరుగుతోందా అనే విధంగా లీనమైపోయారనడంలో అతిశయోక్తి లేదు.
కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలై అటు థియేటర్, ఇటు ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని సర్‌ప్రైజ్ వీడియోలను షేర్ చేస్తోంది చిత్రబృందం. సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు..? వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేశారు..? ఇలాంటి అంశాలు తెలియజేస్తూ గత కొన్నిరోజుల నుంచి వీడియోలు బయటకు వస్తున్న తరుణంలో.. తాజాగా ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థ మకుట ‘కొమురం భీముడో’ పాటకు వీఎఫ్‌ఎక్స్ ఎలా చేశారో వెల్లడిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సినీ అభిమానులను ఆకర్షిస్తోంది.
రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఆలియాభట్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, ఒలీవియా మోరీస్ కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక చిత్రపరిశ్రమలో బాహుబలి తర్వాత అంతగా ఆకట్టుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమేనని. మళ్లీ అంతటి సినిమాను తీయాలంటే.. రాజమౌళి వల్లే అవుతోందంటున్నారు అభిమానులు.