అమలాపురం : కోనసీమలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతం వరదలో చిక్కుకుంది. కోనసీమ ప్రాంతంలో గోదావరి నదీపాయలు పొంగిపొర్లుతున్నాయి. 36 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయినువిల్లి మండలంలోని ఎదురుబిడియం కాజ్‌వే నీట మునిగింది. నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వైపు గ్రామాల నుంచి రాకపోకలు స్థంభించిపోయాయి. అయినవెల్లి, శానపల్లిలంక, విరవెల్లిపాలెం, పల్లపులంక గ్రామాల ప్రజలకు నాటు పడవలపై ప్రయాణం తప్ప మరో దారి లేదు. పి.గన్నవరం మండలం చాకలిపాలెం దగ్గర తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక కాజ్ వేపై గోదావరి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్న రెండు జిల్లాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదపూడి పాయ దగ్గర గోదావరి మరీ ఉదృతంగా ప్రవహిస్తోంది. గంటి పెదపూడి లంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, బూరుగులంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై వరద నీరు చేరింది. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెడపట్నం లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.