కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశం ఉందని ఈమధ్యే రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక మీటింగులు జరుగుతున్నాయి. చాలామంది నేతలు యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారంతా గాంధీ భవన్ మెట్లు ఎక్కుతున్నారు. పార్టీలో అన్నీ చక్కబడి అధికారంలోకి రావాలని మీడియా ముందు మాట్లాడుతున్నారు.
పార్టీ కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే రాక సందర్భంగా గాంధీ భవన్ లో సందడి నెలకొనగా.. పీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయకపోవడం వల్లే ఓడిపోయామని అన్నారు. ఇప్పటికైనా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారు. అయితే.. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సూచించారు.
నిజానికి కోమటిరెడ్డి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. చాలారోజుల తర్వాత గాంధీ భవన్ కు వెళ్లారు. రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇలాంటి సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది సమయం కాదని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇటువంటి విషయాలు తర్వాత చర్చిద్దామన్న ఆయన.. వ్యక్తిగత అంశాలు ఇప్పుడు మాట్లాడొద్దని.. ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించిన దానిపై చర్చిద్దామని చెప్పారు. సమావేశం ఎజెండాపై మాత్రమే మీటింగ్ లో మాట్లాడాలని పార్టీ శ్రేణులకు రేవంత్ సూచించారు.