– క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ కుదరదు
– కుట్ర జరిగితే ఆధారాలు బయటపెట్టు
– సీఎం మాటలకు జనం నవ్వుతున్నారు
– కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్లు
కాళేశ్వరం పంప్ హౌస్ లు మునకతో ప్రభుత్వం, కాంట్రాక్టర్ సంస్థల డొల్లతనం బయటపడడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ నానా తిప్పలు పడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ముంపు గ్రామాల్లో పర్యటనకు వెళ్లిన సీఎం భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ అని.. దీని వెనుక విదేశీ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అంతే.. ఈ డైలాగ్స్ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచేశాయి. లోపాలు కప్పిపుచ్చుకునేందుకే క్లౌడ్ బరస్ట్ డ్రామాకు తెరతీశారని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.
తాజాగా సీఎంపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారని అన్నారు. ఒకవేళ ఫ్రూఫ్ లు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే అందరికీ క్లారిటీ వస్తుందని తెలిపారు. క్లౌడ్ బరస్ట్ ఏ సందర్భంలో జరుగుతుందో వివరించిన కొండా.. సీఎం వ్యాఖ్యలకు జనమంతా నవ్వుతున్నారని విమర్శించారు. ఈ కుట్ర పాకిస్థాన్ వాళ్లు చేశారా లేక చైనా వాళ్లు చేశారా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
రాకెట్స్, విమానం ద్వారా క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్లకు భారత్ లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండాలని అదెక్కడ ఉందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. గజ్వేల్ లో ఏమన్నా ఉందా? అంటూ సెటైర్ వేశారు. క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ రాదని.. దానివల్ల వర్షం రోజంతా పడదని.. కొన్ని గంటలే కురుస్తుందని వివరించారు. క్లౌడ్ బరస్ట్ కొంత ప్రాంతానికే పరిమితమన్న ఆయన… కాళేశ్వరం ప్రాజెక్టుతో వరదను నివారించవచ్చన్నారు. కానీ.. ఆ వరదలతోనే కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయిందని అన్నారు.
కాళేశ్వరం డిజైన్ తప్పని.. రిజర్వాయర్లు ఎక్కడా కట్టలేదని.. నీళ్లు ఎక్కడ ఎత్తిపోస్తారని నిలదీశారు విశ్వేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టుతో వరదను నివారించవచ్చన్న కేసీఆర్.. ఇప్పుడు పంప్ హౌస్ మునిగిపోవడంపై సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన విధానం కరెక్ట్ కాదని తేలిపోయిందని.. మూడేళ్లు కాకముందే కొండ పోచమ్మ లీకేజీ అవుతోందని విమర్శించారు.
వరదల వల్ల నష్టపోయిన బాధితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు కొండా. గతంలో ఇచ్చిన మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. భద్రాచలం దేవాలయానికి కేసీఆర్ రూ.100కోట్లు ఇస్తానన్నారని.. ఇప్పుడు దానికి సున్నా కలిసి రూ.1,000 కోట్లు ఇస్తామంటున్నారని ఎద్దేవ చేశారు. జీహెచ్‌ఎంసీలో వరదలొచ్చినప్పుడు బాధితులకు రూ.10వేలు ఇస్తామని ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు విశ్వేశ్వర్ రెడ్డి.