మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గూటికి చేరారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ మహామహులు, ప్రముఖ నేతల సమక్షంలో లక్షల మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొండా విశ్వేశ్వరరెడ్డికి గ్రాండ్ వెల్ కం లభించింది. జూన్ 29న బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కొండా భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత 30న బీజేపీలోకి వెళ్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ సహా అగ్ర నేతలంతా నగరానికి రావడంతో.. బహిరంగ సభా వేదికపై జాయిన్ అయ్యారు విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కొండాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొండా 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కేసీఆర్ అనుసరిస్తున్న ఉద్యమ వ్యతిరేక విధానాలు నచ్చక 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. అయితే.. గతేడాది మార్చిలో హస్తం పార్టీలో నాయకత్వలోపం కారణంగా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు.