ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే.. నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడట వెనుకటికో పెద్దమనిషి. అందుకే ఆచితూచి మాట్లాడాలని చెబుతుంటారు పెద్దలు. ఇది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు కరెక్ట్ గా సూటయ్యే సామెత. ముందు మైకులు ఉన్నాయి కదా? అని ఏదిపడితే అది మాట్లాడితే తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ నడుస్తోంది. కేంద్రానిదే తప్పంటూ టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తోంది. అయితే.. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ధాన్యం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కేంద్రంతో ఢిల్లీ వేదికగా తాడో పేడో తేల్చుకుంటాం.. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనేది లేదు.. ఎట్టి పరిస్థితిల్లో కేంద్రమే కొనాలి.. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం ముక్కుపిండి వడ్లు కొనిపించాలి.. ఏడాది నుంచి కేంద్రాన్ని నిలదీస్తున్నాం.. ప్రతీ దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. రంజిత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి సెటైర్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన రీతిలో రంజిత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్స్ ఇచ్చారు.
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? మరి.. ప్రతీ గింజ కొంటామని అసెంబ్లీలో చెప్పినోనికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజల పైసలన్నీ దోచుకొని.. ఇప్పుడు ధాన్యం కొనమని ఎలా అంటారు.. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా? మరి ఏమైనట్టు? అని నిలదీశారు. ఈ సంవత్సరం కేంద్రం రూ.8 వేల కోట్లతో తెలంగాణ నుంచి 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నదని.. రంజిత్ రెడ్డికి అసలు లెక్కలు తెలుసా? సబ్జెక్ట్ తెలుసా? కేంద్రం ఎన్ని వేల కోట్లతో పంట కొంటదో తెలియదా? అంటూ కడిగి పారేశారు. పది కోట్లు, వెయ్యి కోట్లా.. వాటితో ఏమైతదని ప్రశ్నించారు విశ్వేశ్వర్ రెడ్డి.
ముక్కు పిండితే ఏమొస్తదో రంజిత్ రెడ్డికి తెలియదా?.. కేసీఆర్ ముంగట కూర్చొని ముక్కే యాదికి వస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల తోటి తెలంగాణ భూములు కబ్జా చేసేందుకు కూర్చొని డబ్బులు అని పలుకుతున్నావ్.. తెలంగాణ సోయి ఉన్నోడివే అయితే పైసలు అని పలుకేటోడివి అంటూ రంజిత్ రెడ్డిని ఓ ఆటాడుకున్నారు విశ్వేశ్వర్ రెడ్డి.