ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, మార్చి 16న మరోసారి ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత వేసే ప్రతీ అడుగు ఆసక్తికరంగా మారింది.
అయితే దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ 9 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారు. అంతే కాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మాజీ అడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారని సమాచారం.
కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామ చంద్రన్ పిళ్లై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లను విడివిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.