– కొంగర్ ఖుర్ద్ ను కొల్లేరుగా మార్చిన వైనం
– ఫోర్జరీ డాక్యుమెంట్లు.. అధికారుల అండదండలు
– కోర్టులను తప్పుదోవ పట్టించడమే పని
– వక్ఫ్ బోర్డు భూములే ఆ నేతల పెట్టుబడి
– రైతుల జాగా కబ్జా కోసమే ఈ బరితెగింపు
– నిజాం రాజులా మారిన హైదరాబాద్ ఎంపీ
– అమలు చేయడంలో పెత్తందారీగా మంత్రి కొడుకు
– లిటిగేషన్ తో బేరసారాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో పక్కా ఆధారాలు
– వక్ఫ్ బోర్డు మాటున దందాపై వరుస కథనాలు
– నయా నిజాం రాజులు- పార్ట్ 1
క్రైంబ్యూరో, తొలివెలుగు:నిజాం రాజుల భూములను వక్ఫ్ బోర్డు పేరుతో లాక్కొంటున్నారు. 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను మూడో కంటికి తెలియకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలకు అంటగడుతున్నారు. గొర్ల మందపై తోడేళ్లు పడ్డట్టు ముప్పేట దాడి చేస్తున్నారు. భూమి అమ్మితే కానీ, కోర్టు గడప తొక్కలేని బక్క రైతు బిక్కు బిక్కు మంటూ బతుకీడుస్తున్నాడు. నిజాం రాజు పన్ను చెల్లించకుంటే ఎలా బాధించే వాడో.. ఇప్పుడు భూములు ఇవ్వకపోతే అలా బెదిరిస్తున్నారు. ఇంతకీ.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు. తెలంగాణ అంతలా నడుస్తోంది. నయా నిజాం రాజులై భూములను దోచేస్తున్న దందాలపై ఇకపై వరుస కథనాలు ఇస్తోంది తొలివెలుగు.
వక్ఫ్ బోర్డు మాటున దగా!
వక్ఫ్ బోర్డు.. ఇది ముస్లింలకు దేవాదాయ శాఖ లాంటింది. తెలంగాణలో దేవుడి పేరు చెప్పుకుని ఎలా అయితే.. వేల ఎకరాలు మింగేశారో.. వక్ఫ్ బోర్డు పేరుతో లక్షల కోట్ల అక్రమ భూ దందా చేశారు.. చేస్తున్నారు. ఇనాళ్లూ సైబరాబాద్ లో ఉన్న భూములను అంటగట్టేవారు. ల్యాంకో హిల్స్ లాంటి ప్రాంతాల పని కానించారు. ఇప్పుడు అంతటా అదే పని చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావడంతో అంతా అనుకున్నట్లే దొచేస్తున్నారు. నగర శివార్లో దందాలు మూడు నకిలీ ఓఆర్సీలు.. ఆరు కోర్టు అర్డర్స్ లా కొనసాగుతోంది. రైతుల భూములను కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ఆ ముఠా ఎవరిది.. దాని మాటున ఉన్న నేతల బాగోతం ఏంటో తొలివెలుగు క్రైంబ్యూరో బట్టబయలు చేయబోతోంది.
ఆ భూములపై కన్ను!
కొంగర్ కొలన్ పక్కనే కొంగర్ ఖుర్ద్-ఏ రెవెన్యూ గ్రామం ఉంది. ఎకరం 7 నుంచి 10 కోట్లు పలుకుతోంది. సర్వే నెంబర్ 1 నుంచి 400 వరకు మొత్తం 600 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములే అని 2007 ఫిబ్రవరి 8న గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ గెజిట్ పై రైతులంతా హైకోర్టుకు వెళ్లారు. రిట్ పిటిషన్ నెంబర్ 21059/2007. ఈ భూములను యథావిధి స్థితిలో ఉంచాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. ఇంకా ఎలాంటి తుది తీర్పు రాలేదు. అదే స్టేటస్ కో ఉత్తర్వుల ద్వారా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.
58 ఎకరాలకు నకిలీ ఓనర్ షిప్స్
ఇబ్రహింపట్నం వండర్ లా నుంచి మొదలుకొని రావిర్యాల వరకు 2వేల ఎకరాలు సర్వీస్ ఇనాం భూములే. కౌలుదారు చట్టం, అగ్రికల్చర్ సిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నీ 50 ఏళ్లుగా దున్నుకునే వేల కుటుంబాల రైతులకే చెందాయి. కానీ, నిజాం కాలం నాటి రికార్డులను ఒప్పుకోలేదు. ధరణి.. రైతులకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఇక్కడే.. దొంగ ఓనర్లు పుట్టుకొచ్చారు. రెవెన్యూ రికార్డులు ఏంటో తెలియని అమాయకపు రైతులకు తెలియకుండానే పేపర్స్ పై ఓనర్స్ అయ్యారు. కాలం తిరగకుండానే టైటిల్ దక్కించుకున్నారు. అయితే.. దొంగ క్లూ వదిలినట్లు వీరి ఫోర్జరీ పేపర్లు దోషిగా నెలబెడుతున్నాయి. పీటీ యాక్ట్ ద్వారా చెట్కూరి రామచంద్రారెడ్డి కుటుంబానికి 58 ఎకరాలు వచ్చింది. 1950 నుంచి 2017 వరకు పహాణీ కాలంలో వారసుల పేర్లు నమోదు అయ్యాయి. వీరి వద్ద నుంచి కొనుగోలు చేసిన గోదాస్ ఫ్యామిలీ అయిన ముదిరాజ్ కుటుంబాలు 15 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో గుంటనక్కలా పొంచి ఉన్న ముఠా ఏడాది క్రితం పంజా విసిరింది. ఫైల్ నెంబర్ జే/2391/1992, జే/2223/92, తేదీ: 10-07-1995, 5-08-19995 న తమకు ఓనర్ షిప్ ఇచ్చారని దొంగ పత్రాలు సృష్టించుకొని రంగంలోకి దిగింది.
తప్పుదారి పట్టించడంలో దిట్ట!
రైతులకు ఓనర్ షిప్ ఇస్తే.. ఆ చుట్టుపక్కల గ్రామస్తులై ఉండాలి. ఎప్పుడైనా వ్యవసాయం చేయాలి. కానీ ఎప్పుడు, ఎక్కడా కనిపించని నక్కా రాజేష్ , ఇ నర్సింహా కి వారి తల్లిదండ్రుల పేర్లపై నకిలీ ఓనర్ షిప్ లు వచ్చాయి. వాటి ద్వారానే నకిలీ పట్టా పాస్ బుక్కులు క్రియేట్ అయ్యాయి. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ల్యాండ్ కన్వర్షన్ అయినట్లు అచ్చం ప్రభుత్వ ముద్రలతో ఫేక్ పత్రాలు సృష్టించారు. వీటితోనే రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి.. రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. భూమిలో నుంచి 100 ఫీట్ల రోడ్డు వెళితే.. రైతులకు నష్టపరిహారం ఇచ్చింది ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు అభ్యంతరం చెప్పగా కోర్టులో డిపాజిట్ అయ్యాయి. కానీ, ఈ ఫేక్ గాళ్లు అప్పుడు చేరలేదు. కానీ, అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిన తీరుని చెప్పకుండానే హైకోర్టులో వక్ఫ్ బోర్డు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో భూమిని మధ్యంతరంగా రద్దు చేయాలని పిటిషన్ వేశారు. రిట్ నెం.7617/2022. గతంలో రైతులు వేసిన పిటిషన్ ని పట్టించుకోకుండానే ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తీర్పులో రైతులు ప్రతివాదులు కాదు. వక్ఫ్ బోర్డు అధికారులు, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి.. తమదేంపోతుందని తల ఊపారు. రిజిస్ట్రేషన్స్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేసుకున్నారు. రిట్ నెం.30132/2022. కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో భూమి లేకుండానే టైటిల్ దక్కించుకుంటున్నారు. డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ చేయించుకుంటున్నారు. అయితే.. ఇంజెక్షన్ ఆర్డర్ కోసం ఇబ్రహింపట్నం కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక్క లీజుదారుడే రంగారెడ్డి, మహేశ్వరం కోర్టులో ఓఎస్ 62/2022, 224/2022 పిటిషన్స్ వేసి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. పోలీసులను ఒక వైపు సెక్యూరిటీ కోరారు. మరోవైపు పోలీసులు చొరవ చూపొద్దని రెండు తీర్పులు తెచ్చుకున్నారు. ఈ రెండు పిటిషన్స్ లో రైతుల పేర్లు చేర్చినా.. అడ్రస్ సరిగ్గా ఇవ్వకుండా శంషాబాద్, రాజేంద్రనగర్ అంటూ ఇచ్చారు. దీంతో రైతులకు నోటీసులు రాకుండానే ఎక్స్ పార్టీ ఆర్డర్లు పొందారు. కోర్టును నమ్మించేలా చిన్న, చిన్న పత్రికల్లో యాడ్స్ ఇచ్చారు. మొత్తానికి 58 ఎకరాలకు తామే ఓనర్స్ అని కలరింగ్ ఇస్తూ.. కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటిపై రైతులు ఇబ్రహింపట్నం కోర్టులో పిటిషన్(ఓఎస్ 353/2022) వేశారు.
వాట్ నెక్స్ట్?
దొంగ ఓఆర్సీల నుంచి భూమి లేకుండానే ఓనర్స్ అయిన ఇ నర్సింహా, నక్కా రాజేష్ ఎవరు? రైతులకు ఎకరం కోటి ఇస్తాం వెళ్లిపోండి అని రాయబారం నడిపించేది ఎందరు? 2022లో తీర్పులు తెచ్చుకోవడం వెనుక ఉన్నదెవరు? జీపీఏ చేయించుకున్న ఎన్క్యూబ్ వెంచర్స్ ఎవరిది? పొజిషన్ లేకుండానే ఎలా హెచ్ఎండీఏ లే-అవుట్ అనుమతికి వెళ్లారు. ఇలా మరో 150 ఎకరాల్లో ఎలా కబ్జాలు చేశారు? తాజాగా జనాలకు పేపర్ పై లే-అవుట్స్ చూపించి ప్లాట్స్ ఎలా అమ్ముకుంటున్నారో మరో కథనంలో చూద్దాం.