తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రియుడి వేధింపులు భరించలేక ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…మృతురాలు పల్లవి (21). ఆమె తల్లిదండ్రులు ఆంగోతు సరిత, అంతిరామ్. వీరు కొంగరకలాన్ తండాకు చెందినవారు. వీరికి రెండో కుమార్తె పల్లవి. ఆమె వండర్ లాలో పల్లవి ఉద్యోగం చేస్తోంది.
హైదరాబాద్ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి అనే యువకుడు కొంగరకలాన్ లో ఉండే తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం క్రాంతి, పల్లవిల మధ్య పరిచయం ఏర్పడింది. అది రోజులు గడిచిన కొద్ది ప్రేమగా మారింది. మరోవైపు వండర్ లాలో తనతో పాటు కలిసి పనిచేస్తున్న ప్రణయ్ అనే వ్యక్తితో పల్లవికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రణయ్ తో పల్లవి చనువుగా ఉంటుందని.. ఫోన్లు మాట్లాడుతుందని.. చాటింగ్ లు చేస్తుందని క్రాంతి అనుమానించాడు.
ఈ విషయం మీదే గత రెండు నెలలుగా ఇద్దరు మధ్యలో గొడవలు మొదలయ్యాయి. గురువారం నాడు.. క్రాంతి, పల్లవి కలుసుకున్నారు. వారిద్దరూ కలిసి బైక్ మీద సాయిబాబా గుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ క్రాంతి.. పల్లవిని బెదిరించాడు. ‘నీ బాగోతం అంతా నాకు తెలుసు. నీ విషయం అందరికీ చెప్పి పరువు తీస్తా’ అని బెదిరించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు.
అయితే, క్రాంతి మాట్లాడిన మాటలతో పల్లవి తీవ్రమనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే.. ‘ఐ లవ్ యు.. లాస్ట్ మెసేజ్’ అని క్రాంతికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఊరి చివరికి వెళ్లి.. అక్కడ ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పల్లవి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న డిసిపి శ్రీనివాస్ ఇబ్రహీంపట్నం ఏసిపి ఉమామహేశ్వర రావు…పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆమె ఆత్మహత్య నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత పల్లవి మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత.. భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అంత్యక్రియలు పూర్తి చేయించారు. దీని మీద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. సాయిబాబా గుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె దగ్గర నుంచి ఇదే చివరి మెసేజ్ అని రావడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. వెంటనే విషయాన్ని అతను ఆదిభట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
తల్లిదండ్రులకు కూడా విషయాన్ని తెలపడంతో. పల్లవి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పల్లవి గురించి వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా పల్లవి ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత శుక్రవారం నాడు పల్లవి చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. అది చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేక బోరున విలపించారు. పల్లవి ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు క్రాంతి, ప్రణయ్ లను ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.