– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్
– హాట్ టాపిక్ గా ఇల్లందు ఆత్మీయ సమావేశాలు
– పొంగులేటి వెంటే నడుస్తున్న కనకయ్య
– పోటీగా ఎమ్మెల్యే హరిప్రియ సమావేశం
– ఇవి.. ఆత్మీయ సమ్మేళనాలా? లేక బలప్రదర్శనా?
ఈమధ్యకాలంలో ఖమ్మం కేంద్రంగా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టు బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.
కనకయ్య.. పొంగులేటి వైపే ఉన్నారని దీన్నిబట్టి అర్థం అవుతోంది. అంతేకాకుండా ఇటీవల బీఆర్‌ఎస్ సభకు ఆహ్వానం అందినా కూడా వెళ్లలేదు. అయితే.. ఎమ్మెల్యే హరిప్రియ కూడా పోటీగా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. మునిసిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఈ ఏర్పాట్లు చేశారు. పోటాపోటీగా ఇద్దరు నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.
కోరం కనకయ్య 2009లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక 2014లో తిరిగి కాంగ్రెస్ నుండి టికెట్ దక్కించుకొని గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ లో చేరి పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి బానోతు హరిప్రియ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే.. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టేకులపల్లి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక హరిప్రియ విషయానికొస్తే.. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కనకయ్య చేతిలో ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచారు. అయితే.. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఇద్దరు నేతలు గులాబీ గూటిలోనే ఉన్నారు. కానీ, కనకయ్య మాత్రం పొంగులేటితో నడుస్తున్నారు. ఈక్రమంలో వీళ్లిద్దరూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడం చూసి.. ఇవి ఆత్మీయ సమ్మేళనాలా? లేక బలప్రదర్శనా? అని నియోజకర్గం అంతా చర్చించుకుంటున్నారు.