నెల్లూరు రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి,వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. కోటం రెడ్డి చేసింది నమ్మక ద్రోహమన్న ఆయన..సీఎం వైఎస్ జగన్ నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయడం తప్పు అని హితవు పలికారు.
ఇక పక్షులు వలస వెళ్లే కాలం ఇదంటూ ఎద్దేవా చేశారు. మేం కూడా విచరాణ చేయమని అడుగుతాం.. ఏముంది దాంట్లో..కానీ లోకేష్ తో టచ్ లో ఉండొచ్చా..అని నిలదీశారు. డిసెంబర్ 27న బుధవారం బెంజ్ కారులో కోటం రెడ్డి..హైదరాబాద్ వెళ్ళి వచ్చాడని అంటున్నారు. అంతే కాదు ఆరోగ్యం బాగోపోతే ఫోన్ చేశారట.. మరి నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నాకెందుకు లోకేష్, చంద్రబాబు ఫోన్ చేయలేదు.. అని ఎద్దేవా చేశారు పేర్నినాని.
అసలు నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ తో భయపడడం ఎందుకు అని మండిపడ్డారు. ‘కోటం రెడ్డి నా భక్తుడనే మత్తులో సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. నిజంగా నిఘా పెట్టి ఉంటే లోకేష్ తో టచ్ లో ఉన్న విషయం ఎప్పుడో తెలిసేది కదా.. ‘అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి చిన్నదా.. రెండు సార్లు ఎమ్మెల్యే చేయడం అంటే చిన్న విషయమా.. అని నిలదీశారు.
రాజకీయాల్లో సామాజిక,జిల్లా సమీకరణాలు ఉంటాయి..వాటిని దృష్టిలో పెట్టుకునే పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి కొడుకుగానే వైఎస్ జగన్ ను అభిమానించాను..పదవుల గురించి చూసుకుంటే రాజకీయ అవసరాలు అవుతాయి.. కానీ అభిమానం అవ్వదని కీలక వ్యాఖ్యలు చేశారు.