నెల్లూరు పొలిటికల్ హీట్ హస్తీనాకు పాకింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాయడం ఇప్పుడు సంచలనమైంది. తన వ్యక్తిగత స్వేఛ్చకు భంగం కల్గించారన్న ఎమ్మెల్యే..నిజానిజాలు తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరాలంటూ డిమాండ్ చేశారు.
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ క్రమంలో కోటం రెడ్డి అమిత్ షాకు లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై విచారణ జరిపించడంతో పాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన లేఖలో కోరారు.
ఇక తాను ట్యాపింగ్ ఆరోపణలు చేసిన తర్వాత తనను నెల్లూరు ఇన్ ఛార్జ్ గా తప్పించారని.. ఆ తర్వాత నుంచి తనకు సంఘవిద్రోహక శక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కోటం రెడ్డి తెలిపారు. తనపై అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారన్నారు. తనతో పాటు తన కేడర్, మద్దతుదార్లకు కూడా ప్రాణహాని ఉందని లేఖలో కోటం రెడ్డి తెలిపారు.
తన వ్యక్తిగత అంశాలను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని.. తన స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశానంటూ కోటం రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా ఎమెల్యేగా నాలుగేళ్లుగా రూరల్ సమస్యలపై అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నానని.. ముఖ్య మంత్రి జగన్ అనేక సమస్యలపై సంతకాలు కూడా చేశారని.. కానీ పనులు మాత్రం జరగడం లేదని కోటం రెడ్డి తెలిపారు.