కోటం రెడ్డి వ్యవహారంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. మ్యాన్ ట్యాపింగ్ అని మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలనే నిర్ణయం కోటం రెడ్డి వ్యక్తిగతమని కోటం రెడ్డి వైసీపీ పై బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..ఆడియో రికార్డు అని కోటం రెడ్డికి తెలుసన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. ఫోన్ రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు..మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. కోటం రెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ కాదా..అని ప్రశ్నించారు.
కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైందని కోటం రెడ్డి ప్రశ్నించారు మంత్రి కాకాణి. చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారని అందుకే టీడీపీ వాళ్లు ట్యాపింగ్..ట్యాపింగ్ అంటున్నారని విమర్శించారు ఆయన. కోటం రెడ్డిని పావుగా వాడుకొని చంద్రబాబు ఆడిస్తున్నారన్నారు. నీకు ఆవేదన కాదు.. ఆలోచన అవసరమని ఆయన కోటం రెడ్డికి సూచించారు. శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్య లాంటిదని చెప్పారు.
చంద్రబాబు చెప్పినట్టు శ్రీధర్ మాట్లాడుతున్నారని చెప్పారు కాకాణి. లోకేష్ పాదయాత్ర విఫలం కావడంతో ప్రభుత్వం మీద బురద చల్లేందుకు శ్రీధర్ లాంటి వాళ్లను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. శ్రీధర్ భుజంపై గన్ పెట్టి కాల్చాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ట్యాపింగ్ జరగలేదు.. ఇప్పటికైనా శ్రీధర్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హితవు పలికారు.