ఏపి అసెంబ్లీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రెండు రోజుల నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వైసీపీకి దూరంగా ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మైక్ ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరిస్తే సీఎంను అభినందిస్తా అని చెప్పారు. అయితే కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
శ్రీధర్ రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ కోసం కోటం రెడ్డి పని చేస్తున్నారని అంబటి ఆరోపించారు. టీడీపీతో చేతులు కలిపి దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని, చంద్రబాబు మెప్పు కోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ కోటం రెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పారు.