కేరళ కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. పైలట్, కోపైలట్‌తో పాటు 15 మంది దుర్మరణం చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది సహా 174 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.
ఎయిర్ ఇండియాకు చెందిన IX-1344 విమానం దుబాయ్ నుంచి.. కొజికోడ్‌కు రాత్రి 7.40 గంటల సమయంలో చేరుకుంది. వాస్తవానికి రన్‌వేపై విమానం సాఫీగానే ల్యాండ్ అయినప్పటికి.. ఆగకుండా అంచువరకూ దూసుకెళ్లిపోయింది. అక్కడ గోడను ఢీకొట్టి అక్కడి లోయలో పడిపోయింది. దీంతో రెండు ముక్కలైపోయింది.
ప్రమాద సమయంలో ఎలాంటి మంటలు రాలేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆ సంస్థ తెలిపింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఈ విమానం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా తమ నెట్‌వర్క్‌పై ప్రభావం పడిప్పటికీ.. వందేభారత్ మిషన్ కొనసాగుతుందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.