సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో క్రాక్ ఈసారి విజేతగా నిలిచింది. కలెక్షన్ల సంగతి అటుంచితే… సినిమా బాగుందన్న టాక్ క్రాక్ సొంతం చేసుకుంది. ఎన్నాళ్లుగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజకు రిలీఫ్ అందించింది. అయితే, క్రాక్ మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి ఫోన్ చేసినట్లు తెలిసింది.
సినిమా తీసిన తీరు, టేకింగ్ బాగున్నాయంటూ చిరంజీవి ప్రశంసించారని, ఆయన ప్రశంసిస్తున్నప్పుడు ఊహాల్లో తెలియాడినట్లు అనిపించిందంటూ గోపిచంద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాక్సాఫీసు వద్ద సినిమా బాగా ఆడటంలో మెగా ఫ్యామిలీ తోడుందన్నారు.
ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ తో పాటు ఛాలెంజింగ్ రోల్ చేసిన శృతిహసన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కథకు రవితేజను మినహా మరెవర్నీ ఊహించుకోలేకపోయానంటూ తెలిపారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన తర్వాతి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు.