ఏపీ, తెలంగాణల మధ్య వాటర్ వార్ తారాస్థాయికి చేరింది. శ్రీశైలం నదీ జలాల విషయంలో తాజాగా కేంద్రం స్పందించింది. కృష్ణా రివర్ బోర్డు తమ ఆదేశాలను పాటించేలా చూడాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం వరుసగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉందన్నా ఆరోణలున్నాయి.
ఇదే విషయంలో జూన్ 4 న జరిగిన కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో 2020-21లో ఉత్పత్తి అయిన శ్రీశైలం మొత్తం విద్యుత్ ను సమంగా పంచుకోవాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని బోర్డు కేంద్రంకు రాసిన లేఖలోనూ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాగు, తాగు నీరు కోసం ఎడమగట్టు ద్వారా సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నామని, సాగర్ రైతాంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటుంది. భవిష్యత్ అవసరాల కోసమే కిందకు నీరు విడుదల చేస్తున్నామని, సాగర్ లో నీరు నిల్వ చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి ఇప్పటికే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దీనిపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. శ్రీశైలంలో నీరు తగ్గుతున్నందున విడుదల ఆపాలని కోరుతుంది. ఆగస్టు 3న ఈ మేరకు మళ్లీ లేఖ రాయటంతో… ఈ మొత్తం విషయంలో జోక్యం చేసుకొని, తమ ఆదేశాలను తెలంగాణ పాటించేలా చూడాలని కృష్ణా బోర్డు కేంద్రాన్ని కోరింది.
పైగా శుక్రవారం నుండి తెలంగాణ ప్రభుత్వం సాగర్ ఆయకట్టుకు సాగునీరు కూడా విడుదల చేస్తుండటంతో… కృష్ణా బోర్డు కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని కోరటం హాట్ టాపిక్ గా మారింది.