విజయవాడ : మూడు, నాలుగు రోజులు ఉగ్రత చూపిన కృష్ణమ్మ నెమ్మది నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రవాహం కూడా తగ్గింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.
ఎగువన వున్న జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 3.54 లక్షల క్యూసెక్కులయితే.. 21 గేట్ల ద్వారా 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ఇక్కడ 8.434 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 213.516 మీటర్లయితే, ప్రస్తుతం 317.910 మీటర్ల మేర ఉంది.
ఇక, శ్రీశైలం జలాశయనికీ వరద నెమ్మదిగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులైతే.. ఔట్‌ఫ్లో 3.79 లక్షలుగా ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇక్కడ నీటిమట్టం 882.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలయితే.. ఇప్పుడు 200.65 టీఎంసీల నీరు ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,931 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 34 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం 10 గేట్లను పైకెత్తి 2,68,717 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇలావుంటే, నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం దాదాపు తగ్గింది. ఈ జలాశయానికి 3.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. దాన్నంతా దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులైతే.. ప్రస్తుతం ఇక్కడ నీటిమట్టం 586.50 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు. ఇప్పుడు ఇక్కడ 302.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ 26 గేట్లను ఎత్తి 2.66 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక, చిట్టచివరన ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొద్దికొద్దిగా తగ్గుతోంది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కరకట్ట ఆనుకుని వున్న గ్రామాల్లోని పంటపొలాల్లో అక్కడక్కడ వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజ్‌కి దిగువన నదీగర్భం నిండుగా కృష్ణానది పొర్లుతుండటంతో ఆ దృశ్యాన్ని చూడ్డానికి జనం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్దఎత్తున వస్తున్నారు.