కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాత్కాలికంగా కొనసాగుతున్న కార్యాలయాన్ని… విశాఖపట్నానికి తరలించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కృష్ణా బోర్డు అధికారులకు ప్రభుత్వం లేఖ రాసింది. ఇన్నాళ్లు ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖలో కృష్ణా బోర్డు కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని వెతికేందుకే ఇప్పటకికే అధికారులు రంగంలోకి దిగారు. అది పూర్తయిన వెంటనే తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కృష్ణాబోర్డును విజయవాడ తరలించడంపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ.. గత అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఓకే చెప్పింది. అయితే ఇప్పుడు విశాఖకు తరలిస్తే తెలంగాణ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేయొచ్చని అంటున్నారు. కాగా కృష్ణాబోర్డును విశాఖకు తరలించడంపై ఏపీలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా నది పక్కనే ఉన్న విజయవాడలో కాక, అసలు సంబంధమే లేని విశాఖలో ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.